Telugu Study Bible APP
వ్యాఖ్యానాలతో రిఫరెన్సులతో కూడినది
ఈ వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథానికి (Study Bible) గ్రేస్ మినిస్ట్రీస్ వారు ప్రచురించిన బైబిలు అనువాదాన్ని (మూడవ ముద్రణ) ఉపయోగించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న తెలుగు బైబిల్ అనువాదాలన్నిటిలోకీ ఇది మూలానికి దగ్గరగా ఉన్నదీ, సరియైనదీ. అంతేగాక చదవడానికి అన్నివిధాలా అనుకూలంగా ఉండే సులభశైలిలో ఉంది. వ్యాఖ్యానాలు చేర్చేందుకు అనువైనది.
అసలు వ్యాఖ్యాన సహితంగా పవిత్ర గ్రంథం ఎందుకుండాలి? ఎందుకంటే బైబిల్ చదివేవారు దాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలగాలని. మనం దేవుణ్ణి, ఆయన వాక్కునూ బాగా ఎరిగి ఉండడమే మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన విషయం. అయితే వ్యాఖ్యానం, నోట్సు మొదలైన వాటితో నిమిత్తం లేకుండానే అర్థం చేసుకోవడం సాధ్యపడదా? నిజానికి బైబిల్లోని కొన్ని భాగాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. బైబిలును చాలా జాగ్రత్తగానూ, ప్రార్థనా పూర్వకంగానూ, విశ్వాసంతోనూ నేరుగా చదవడంవల్ల దానిలోని ఎన్నో విషయాలను చక్కగా అర్థం చేసుకోవచ్చు. అయినా కొన్ని భాగాలు మాత్రం ఎంత స్పష్టంగా ఉన్నప్పటికీ, చదివేవారు వాటిలో అంతర్లీనంగా ఉన్న పాఠాలన్నిటినీ గ్రహించలేకపోవచ్చు. బైబిల్‌ను లోతుగా తరచి అధ్యయనం చేయడంలో అనేక సంవత్సరాలు గడిపిన పండితులు సాధారణంగా సగటు చదువరులు గమనించలేని కొన్ని పాఠాలనూ, సత్యాలనూ సూచించగలరు. బైబిల్లో కొన్ని భాగాలైతే అర్థం చేసుకోవడం చాలా కష్టం. కొందరు బైబిల్ రచయితలు సహితం ఇలా భావించారు (2 పేతురు 1:20; 3:15,16 చూడండి).
బైబిలు దేవుని గ్రంథం. దానిలో ఆయన వెల్లడి చేసిన విషయాలు గంబీరమైనవి, భావగర్భితమైనవి (యెషయా 55:8,9). దేవుని వాక్కుకు ఉత్తమ ఉపదేశకుడు దేవుడే గదా. బైబిల్ చదివే ప్రతి వ్యక్తీ అందులోని విషయాలు తనకు బోధ పడేందుకు దేవుని మీదనే ఎక్కువగా ఆధారపడితే మరింతగా నేర్చుకోగలుగుతాడు. తన సత్యాలను మనుషులకు నేర్పడం దేవునికి ఎంతో ఇష్టం. అలా నేర్పించమని వినయంతో మనం ఆయన్ను వేడుకోవాలి (కీర్తన 25:4–9)
కానీ బైబిల్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడంలో ఇతరుల సాయం ఎంతమాత్రం పొందకుండా అందులోనిదంతా సంపూర్ణంగా అర్థం చేసుకోగల స్థితికి మనలో ఎవరు చేరగలం? ఈ వ్యాఖ్యానాలు, వివరణలు రాసిన రచయిత గుర్తించిన ఒక సత్యం ఇది – బైబిల్‌ను అర్థంచేసుకోవడానికి బైబిల్ చాలు అనుకుంటూ, దేవుడు తన సేవకుల ద్వారా అందించే సహాయకరమైన సమాచారాన్ని తిరస్కరించేవారు చాలామంది విపరీతమైన భావనలకూ, బైబిల్ విరుద్ధమైన ఉద్దేశాలకూ లోనవుతారు. దేవుని వాక్కును అర్థం చేసుకోవడానికి ఇతరులకు సహాయపడిన దైవ సేవకులు అనేకమంది బైబిల్లో కనిపిస్తారు (ఎజ్రా 8:8; అపొ కా 8:28–35). దేవుని సత్యాలను “ఇతరులకు నేర్పగల నమ్మకమైన మనుషులకు అప్పజెప్పు” అని పౌలు తిమోతిని ఆదేశించాడు(2 తిమోతి 2:2). ఇంకా “దేవుని వాక్కు ప్రకటించు. యుక్తకాలంలో, అకాలంలో సిద్ధంగా ఉండు. నిండు ఓర్పుతో ఉపదేశంతో మందలించు, చీవాట్లు పెట్టు, హెచ్చరించు” (2 తిమోతి 4:2) అని కూడా అన్నాడు. ఈ స్టడీ బైబిల్లో దీన్నే చేయడానికి ప్రయత్నించాం. జాగ్రత్తగా ఉపదేశించడానికీ, పొరపాటు భావనలను సరిదిద్దడానికీ, తప్పుడు మార్గాలనూ క్రియలనూ మందలించడానికీ సమకట్టాం. దేవుని వాక్కుకు ప్రజలు విధేయత చూపేలా ప్రోత్సహించడానికీ పూనుకున్నాం.
మేము అందిస్తున్న వ్యాఖ్యానాలు, వివరణలు పరిపూర్ణం కావనీ, లోపరహితం కావనీ మాకు బాగా తెలుసు. అనేక పొరపాట్లు ఉండి ఉండవచ్చని కూడా భావిస్తున్నాం. బైబిలు మాత్రమే నిర్దోషమైనది, దైవావేశం వల్ల కలిగినది, ఏ లోపమూ లేనిది, పరిపూర్ణమైనది (2 తిమోతి 3:16,17; 2 పేతురు 1:2; మత్తయి 4:4; 5:18). మేము ఇందులో ఇచ్చిన వ్యాఖ్యానాలు, నోట్సు దేవుని నోటనుండి వచ్చినవి కావు, దైవావేశం వల్ల కలిగిన లేఖనాలవంటివి కావు. మేము ఇందులో ఇచ్చిన వ్యాఖ్యానాలు, నోట్సు ప్రార్థన పూర్వకంగా చదువుతూ రాస్తూ ఉన్నా, ఏ తప్పు చేయకూడదని ఎంత ప్రయాసపడినా కూడా, వివరించడంలో అక్కడక్కడ కొన్ని తప్పులు చేసివుండవచ్చు. అందువల్ల జాగ్రత్తగా వాటిని పరీక్షించి సారాంశాన్ని గ్రహించాలే గాని, మేము వ్రాసిన ప్రతిదీ దైవవాక్కు అయినట్టు తీసుకోకూడదు. (1 తెస్స 5:21 చూడండి). ఈ వ్యాఖ్యానాల నుండి నేర్చుకోగలిగిన దాన్ని నేర్చుకోవడానికీ, దేవుని వాక్కుకు విరుద్ధంగా ఉన్నట్టు రుజువైతే దాన్ని తిరస్కరించడానికీ చదువరులు సిద్ధపడి ఉండాలి.
బైబిలును అర్థం చేసుకోవడానికీ దేవుని ఆత్మ అందించే సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం (1 కొరింతు 2:10–14). దీనిని మీరు ధ్యానించేటప్పుడు దేవుని ఆత్మతో నిండి, ఆయనపై ఆధారపడండి.